Karnataka Effect on BRS: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఫలితం తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు చర్చ. కర్ణాటక ..తెలంగాణ సరిహద్దులోనూ కాంగ్రెస్ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. తెలుగు ప్రజలు ప్రభావం చూపించే నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న వేళ తమ ప్రభావం అని చెప్పుకున్నా..కాంగ్రెస్ కు మద్దతు గా నిలిచిన ఓటర్లు తెలంగాణలో ఏం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది. ప్రధానంగా హైదరాబాద్–కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్‌కు భారీగా సీట్ల్లు రావటంతో కొత్త సమీకరణాలకు ఈ ఫలితం కారణం అవుతోంది.
కర్ణాటక ఎన్నికల తాజా ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్పై రకరకాల అంచనాలు వేస్తున్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పైగా బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన తర్వాత కర్ణాటకతోనే సీఎం కేసీఆర్ ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరిపినందున ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. కర్ణాటక విజయం ఇచ్చిన కిక్కుతో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడి బీఆర్ఎస్కు సమస్యగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఎంత బలపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతగా చీలి తమకు సహకరిస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది.
కాంగ్రెస్ కు పాజిటివ్ ఓటు పెరిగితే నష్టం ఏ మేర చేరస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోరుగా ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయం కొనసాగింది. కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం కోసం పోరాటం చేస్తోంది. ఇప్పుడు కర్ణాటక ఫలితాలు తెలంగాణ పైన ప్రభావం చూపిస్తాయనే లెక్కలు మొదలయ్యాయి. కేసీఆర్ ప్రభావమే పొరుగు జిల్లాలపై పడిందనే వాదన కొందరు బీఆర్ఎస్ మద్దతు దారులు వినిపిస్తున్నారు. కేసీఆర్ కు మద్దతు కోసమే అయితే జేడీఎస్ కు ఎందుకు ఓట్లు పడలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో అమలు చేసిన యూనిటీ ఫైట్ ఇక్కడా సాధ్యం కాగలిగితే బీఆర్ఎస్ కు కష్టం తప్పదని అంచనాలు ఉన్నాయి.
కేసీఆర్ పరోక్షంగా మద్దతిచ్చిన కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ బొక్కబోర్లా పడింది. ఇది బీఆర్ఎస్కు పెద్ద షాకేనని చెబుతున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాక ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల్లో జేడీఎస్ నేత కుమారస్వామియే తొలుత కేసీఆర్‌ను కలిశారు. ఆయన నాలుగైదుసార్లు కేసీఆర్‌ను కలవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. కుమారస్వామికి కేసీఆర్ ఆర్థిక సాయం కూడా చేశారన్న ప్రచారం జరిగింది. దాంతో బీఆర్ఎస్, జేడీఎస్ కలిసే కర్ణాటకలో పోటీ చేస్తాయన్న వార్తలొచ్చాయి. కర్ణాటకలో జేడీఎస్ గెలిస్తే అక్కడ కుమారస్వామి ద్వారా చక్రం తిప్పవచ్చునని కేసీఆర్ భావించారు. ఒకవేళ కాంగ్రెస్‌కు గానీ బీజేపీకి గానీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే… జేడీఎస్ ద్వారా రాజకీయాన్ని నడపవచ్చుననుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి.
కర్ణాటకలో అందునా… హైదరాబాద్–కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఈ రీజియన్‌లోని బీదర్, యాద్గిర్, రాయ్‌చూర్, గుల్బర్గా, కొప్పల్ తదితర ప్రాంతాల్లోని ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య బంధుత్వాలు, చుట్టరికాలున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ రాకపోకలు సాగుతుంటాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువారు, ఇక్కడి సరిహద్దు నియోజకవర్గాల్లో కర్ణాటక ప్రజలు నివసిస్తున్నారు. అక్కడి సరిహద్దు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో, సరిహద్దు జిల్లాలైన సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో పాటు బాన్సువాడ వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్పై ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. దానికితోడు కర్ణాటకలో గెలిచిన ఊపుమీదున్న కాంగ్రెస్, తెలంగాణలోనూ మరింత పుంజుకోవచ్చునని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకెళ్తాయో చూడాలి