HRC: మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు
Kama reddy Maser Plan controversy reaches HRC
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమపై దాడికి కారణమైన కలెక్టర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా తాము.. నిసరన వ్యక్తం చేస్తుంటే.. పోలీసులు దారుణంగా వ్యవహరించారని బాధితులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా.. మాస్టర్ ప్లాన్ లో తమ భూములు లాక్కోవడం తీవ్ర అన్యాయమని బాధిత రైతులు HRC ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని రైతులు ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను అనుసరించి ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎనిమిది గ్రామాల రైతుల నుంచి భూమిని సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్‌కు కేటాయించాలనే ప్రతిపాదనను అధికారులు తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదనలను అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐదు గ్రామాలకు చెందిన రైతులు కొన్ని రోజుల క్రితం ఆందోళనకు దిగారు. కలెక్టరేటు గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుని పోయారు. ఈ తోపులాటలో పలువురు రైతులు గాయపడ్డారు.
రైతులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా రంగంలో దిగారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బండి సంజయ్ ను పోలీసులు అక్కడి నుంచి వెంటనే హైదరాబాద్ తరలించారు.