Kavitha: మార్చి 11న కవిత ఈడీ విచారణ, ఆందోళనకు సిద్ధమౌతున్న గులాబీ శ్రేణులు
Kalvakuntla Kavitha will attend ED Interrogation on March 11
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 11న కవిత ఈడీ ముందు హాజరు కానున్నారు. మార్చి 9న తాను విచారణకు హాజరు కాలేనని మరో తేదీ సూచించాలని కవిత ఈడీ అధికారులను కోరారు. కవిత విన్నపాన్ని మన్నించిన ఈడీ మార్చి 11న విచారణకు హాజరయ్యేందుకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.
మార్చి 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని కోరుతూ భారత జాగృతి నేతృత్వంలో కవిత దీక్షకు దిగుతున్నారు. దేశంలో పలు రాష్ట్రాల నుంచి మహిళా నేతలు ఈ దీక్షలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్యాబినెట్ సమావేశం
కవితను ఈడీ విచారణ చేయనున్న నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ ప్రత్యేక భేటీ కానున్నట్లు తెలుస్తోంది. విచారణకు పిలిచి అరెస్టు చేస్తే పార్టీ తరపున ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోడానికి ఇతర రాష్ట్రాల నేతలతో ఏ విధంగా కలిసి పోరాటం చేయాలని విషయంలో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంలో పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
నిరసన కార్యక్రమాలు
కవితను ఈడీ విచారణ చేస్తున్న నేపథ్యంలో గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగనున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరగడంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు పక్కాగా చేసేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు.