JEE Main 2022:నేటినుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు
JEE Main 2022: Session 2 Exams: ఈరోజు నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తి చేసింది. ఈ పరీక్షలు 30వ తేదీ వరకు జరగనున్నాయి.దేశ వ్యాప్తంగా 6,29,778 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను జూన్ 23- 29 మధ్య నిర్వహించిన విషయం తెలిసిందే.నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసారు.
మొదటి సెషన్లో సరిగ్గా స్కోర్ చేయని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని జేఈఈ మెయిన్ పరీక్షలను 2 సెషన్లుగా నిర్వహిస్తున్నారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు , తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలైంది.
ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్తో పాటు తెలుగులో ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. మెయిన్ పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే కీ విడుదల చేసేందుకు ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది.ఇదిలా ఉంటే గతేడాది జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతలుగా నిర్వహించగా ఈ ఏడాది రెండు ఫేజ్ ల్లోనే నిర్వహిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ సహా పలు నగరాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.