Foxconn: తెలంగాణాలో ఫాక్స్‌కాన్ ఉన్నట్టా ?లేనట్టా ?
Foxconn: ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్ కు చెందిన ‘ఫాక్స్‌కాన్’ సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న వాటిలో ఇది అగ్రగామి సంస్థ. రాష్ట్రంలో టీ-వర్క్స్ ప్రారంభానికి విచ్చేసిన ‘ఫాక్స్‌కాన్’ ఛైర్మన్ యంగ్ లియూ బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమైన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వానికి, ఫాక్స్‌కాన్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌తో వచ్చే పదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం టి-వర్క్స్‌ను యంగ్ లియూ ప్రారంభించారు. ఆ సందర్భంలోనూ ఆయన మాటల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల గురించి తన ప్రసంగంలో ఆయన ప్రస్తావించలేదు. ఆతరవాత రోజే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సైతం ఇదే తరహా ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు పెట్టబోతోందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక సీఎం ప్రకటనతో కొంత సందిగ్ధం నెలకొంది. తాజా పరిణామాలతో ఫాక్స్‌కాన్ అధికారికంగా స్పందించింది. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి తమ చైర్మన్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. తమ చైర్మన్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4 వరకు భారత్‌లో పర్యటించారు కానీ కొత్త ఉద్యోగాలకు సంబంధించి తమ సంస్థ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులకు వచ్చారని తెలపడంలో ఆంతర్యం ఏంటో అనేది తెలియాలి.