PM Modi Hyderabad Tour: ప్రధాని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారా?
PM Modi Hyderabad Tour: ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 19 వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. సికింద్రాబాద్ నుండి విశాఖ వరకు ప్రయాణం చేసే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో ఈ రైలు ప్రయాణం చేయనున్నది. తక్కువ సమయంలో ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెమీ బుల్లెట్ రైళ్లుగా వీటిని అభివర్ణిస్తున్నారు. కాగా, ఈనెల 19 వ తేదీన ఈ రైలును ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి ఐదు సందర్భాల్లో వచ్చారు.
కానీ, సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికేందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపారు. అయితే, ఈసారి ప్రధానిని స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ హజరయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తరువాత సీఎం కేసీఆర్ వైఖరిలో కొంత మార్పులు వచ్చే అకవాశం ఉంటుందని, ఏకపక్షంగా ఉంటే జాతీయ రాజకీయాల్లో రాణించడం కష్టం అవుతుందని, ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది తెలియాలంటే జనవరి 19 వరకు ఆగాల్సిందే.