ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్నది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపింది. అయితే, ప్రధాని మోడీ ఆ భవనాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో తాము హాజరుకాబోవడం లేదని 19 ప్రతిపక్షాలు సంయుక్తంగా ప్రకటనలు చేశాయి.
New Parliament Building: ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్నది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపింది. అయితే, ప్రధాని మోడీ ఆ భవనాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో తాము హాజరుకాబోవడం లేదని 19 ప్రతిపక్షాలు సంయుక్తంగా ప్రకటనలు చేశాయి. పార్లమెంట్ అంటే అందులో రాష్ట్రపతి కూడా భాగం అవుతారని, రాష్ట్రపతి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీయే మిత్రపక్షాలు, మరికొన్ని పార్టీలు కూడా హాజరుకాబోతున్నాయి. అయితే, యూపీఏ లో భాగస్వామ్యమైన పార్టీలు, దాని మిత్రపక్షాలు హాజరుకావడం లేదని ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు ప్రకటించారు. అటు చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇక ఇదిలా ఉంటే, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హాజరవుతుందా లేదా అనే దానిపై ఆ పార్టీ పార్లమెంటరీ నేత కేకే కొంత వివరణ ఇచ్చారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి తాము హాజరయ్యే అవకాశాలు లేవని అన్నారు. అయితే, సీఎం కేసీఆర్‌తో దీనిపై చర్చించాల్సి ఉందని అన్నారు. ప్రతిపక్షాల సంయుక్త కార్యచరణపై బీఆర్ఎస్ పార్టీ సంతకం చేయలేదు. సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేకే తెలిపారు. మజ్లీస్ పార్టీ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీస్ ఒవైసీ తెలియజేశారు. ప్రధాని మోడీ కాకుండా పార్లమెంట్ బిల్డింగ్‌ను ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుంటుందని ఒవైసీ తెలియజేశారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించింది.