BJP Mission 90 in Telangana: బీజేపీ మిషన్ 90 వర్కౌట్ అవుతుందా?
BJP Mission 90 in Telangana: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అయితే, గత కొంతకాలంగా కాషాయదళం దూకుడును ప్రదర్శిస్తున్నది. తెలంగాణ గడ్డపై కాషాయం జెండాను రెపరెపలాడించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే మిషన్ 90 పేరుతో సరికొత్త వ్యూహానికి తెరలేపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాల్లో విజయం సాధించేందుకు అనువుగా పావులు కదుపుతున్నారు. బలంగా ఉన్న స్థానాల్లో మరింత బలం పెంచుకునేందుకు, బలహీనంగా ఉన్న స్థానాల్లో బలపడేందుకు అనువైన వ్యూహాలను రచిస్తున్నారు. ఇక బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా కాషాయ నేతలు అడుగులు వేస్తున్నారు.
జాతీయ నేతలను తరచుగా రాష్ట్రానికి రప్పించి కార్యకర్తల్లో జోష్ ను నింపాలని నిర్ణయించారు. ఇక ఫిబ్రవరి 24 వ తేదీన మహబూబ్ నగర్ లో పార్టీ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈనెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు మరో లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటించే అవకాశం ఉన్నది. ఓటర్ రీచౌట్ ప్రోగ్రామ్‌ను ఎన్నికలు ముగిసే వరకు నిర్వహించాలని, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాజిటివ్ గా ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మిషన్ 90 ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.