Interesting Politics in Rangareddy District: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారసత్వ రాజకీయం
Interesting Politics in Rangareddy District: ఏ రంగంలో అయినా వారసులు ఉంటారో ఉండరో తెలియదుగాని, రాజకీయాల్లో మాత్రం వారసులు ఖచ్చితంగా ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చి కాస్త నిలదొక్కుకున్నాక, స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఆ తరువాత వారసులను రంగంలోకి దించుతారు. ఇలాంటి సంఘటనలు రాజకీయాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. తెలంగాణ రాజకీయం ఇప్పుడు వారసత్వం చుట్టూ నడుస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి తన కొడుకు, కూతురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సరికొత్త వారసత్వ రాజకీయం తెరమీదకు వచ్చింది. అధికార పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తమ వారసులను ఎన్నికల్లో నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజక వర్గంనుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తరువాత ఆమెకు మంత్రి పదవి లభించింది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సబితా కుమారుడు కార్తిక్ రెడ్డి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలైన కార్తిక్ రెడ్డి కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి రాజేంద్రనగర్ నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
అదేవిధంగా మరో మంత్రి మల్లా రెడ్డి కూడా తన కొడుకులను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అవకాశం ఉంటే ఇద్దర్ని లేదా ముందు ఒకర్నైనా ఎన్నికల బరిలో దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇక ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచికంటి తన కొడుకును, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్‌ను లైన్లోకి దించాలని చూస్తున్నారు. మైనంపల్లి రోహిత్ ఇప్పటికే వివిద సోషల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అంజయ్య యాదవ్, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూడా వారి వారసులను పోటీకి సిద్ధం చేస్తున్నారు.
అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ నుండి కూడా వారసులు పోటీకి సిద్దమౌతున్నారు. వీరిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్. వీరేందర్ గౌడ్‌ను మహేశ్వరం నుండి పోటీకి దించాలని చూస్తున్నారు. ఈ విషయంలో దేవేందర్ గౌడ్ పావులు కదుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా దేవేందర్ గౌడ్ పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత దేవేందర్ గౌడ్ ప్రభ మసకబారిపోయింది. ఇక ఇదిలా ఉంటే, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి షాద్ నగర్ నుండి, భిక్షపతి యాదవ్ కుమారుడు రవి యాదవ్ టిక్కెట్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మరికొంత మంది వారసుల పేర్లు తెరమీదకు వచ్చే అవకాశం ఉన్నది.
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారసులు పోటీ చేసే అవకాశాలు లేవని ఆ పార్టీ స్పష్టం చేసింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఆ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేస్తారో చూడాలి.