Ind-NZ ODI: ఉప్పల్ మ్యాచ్ టికెట్ల అమ్మకంలో గందరగోళం
Ind-NZ ODI in Hyderabad: భారత్-న్యూజిలాండ్ మధ్య ఈనెల 18న ఉప్పల్‌లో జరగబోయే వన్డే మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు HCA అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని కూడా ఆయన చెప్పారు. మ్యాచ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమావేశమైన అజారుద్దీన్ ఈమేరకు ప్రకటించినా మళ్ళీ టికెట్ల విక్రయం విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో టికెట్ల విషయంలో గందరగోళం నెలకొన్న వేళ ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అజారుద్దీన్ తెలిపినా టికెట్ల విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ లో 7 వేల టికెట్లు పెడతామని పేటీఎం చెప్పి ఆ మేరకు పెట్టినా టికెట్స్ బుక్ అవడం లేదు.
నిన్న కూడా 6 వేల టికెట్లు ఆన్ లైన్ లో పెట్టి.. కాసేపటికే టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయని పేటీఎం ప్రకటించింది. అయినా ఈ టికెట్ల విషయంలో మాకేం సంబంధం లేదని హెచ్సీఏ చెబుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ గందరగోళంలో మునిగిపోయారు. హెచ్‌సీఏ చెబుతున్న దాని ప్రకారం ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ల విక్రయాలు చేస్తామని, ఫిజికల్ టికెట్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని అంటున్నారు. జనవరి 15 నుండి 18 వరకు ఫిజికల్ టికెట్లు జారీ చేస్తామని, ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఈ ఫిజికల్ టికెట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు టికెట్లు బుక్ అవకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.