Hyderabad: హైదరాబాద్ ను వణికిస్తున్న చలి
Hyderabad: హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. దట్టమైన పొగమంచు కమ్ముకుంటుండడంతో ఉదయం 8 గంటల వరకు రోడ్లు సరిగాకనిపించడం లేదు. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. గత రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు తగ్గాయి. రాజేంద్రనగర్‌లో 14.6, సరూర్‌నగర్‌లో 14.9, సికింద్రాబాద్, గాజులరామారం, అల్వాల్‌లో 15.0 డిగ్రీలు నమోదయ్యాయి.
శివారు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండడం, తెల్లవారు జామున మంచు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట ఉద్యోగాలకు వెళ్లే వారికి చలితో ఇబ్బందు తప్పడం లేదు. సొంత వాహనాల్లో వెళ్లే వారు జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తుంది. ఉదయం సమయంలో రోడ్లు పొగమంచుతో కమ్మేసి ఉంటున్నాయని వాహనదారులు అంటున్నారు.
రాష్టంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమై వెచ్చని దుస్తులను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.