Rains in Telangana: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు
Rains in Telangana: రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బయటకు వచ్చేందుకు ఒకటికి పదిమార్లు ఆలోచిస్తున్నారు. ఈనేపథ్యంలో భారత వాతావరణ సంస్థ చల్లని వార్త చెప్పింది. చత్తీస్‌ఘడ్ నుండి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. మార్చి 16 నుండి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. వర్షాల తరువాత మార్చి 20 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా ఎండతో పాటు ఉక్కపోత కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఎండలు, వడగాలులు కూడా అధికంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, మార్చి నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేయడంతో మార్చి 20 వరకు కొద్దిమేర ఉష్ణోగ్రతలు తగ్గినా, ఆ తరువాత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని, జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.