IMD Alerts: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్… ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం
IMD Alert to Hyderabad: వాతావరణ శాఖ హైదరాబాద్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. జంట నగరాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. గురువారం రోజున నగరంలో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం పొగమంచు విపరీతంగా కురిసే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని తెలియజేసింది. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించింది. నగరవాసులు అత్యవసరమైతేనే తప్పించి ఉదయం సమయంలో బయటకు రావొద్దని తెలియజేసింది.
జనవరి 26 నుండి పొగమంచు కురిసే అవకాశాలు ఉన్నాయని, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి తదితర జోన్లలో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ఉదయంతో పాటు సాయంత్రం సమయంలో కూడా పొగమంచు కురుస్తుందని తెలియజేశారు. బుధవారం రోజున 13 డిగ్రీలు, గురువారం రోజున 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకొవాలని అధికారులు హెచ్చరించారు. ఉన్నిదుస్తులు ధరించాలని, ముఖ్యంగా పిల్లలను బయటకు పంపే విషయంలో తల్లిదండ్రులు ఆలోచించి పంపాలని తెలిపారు. ఉదయం సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా తెలియజేశారు.