Hyderabad: హైదరాబాద్ మార్కెట్ లో శరవేగంగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు
Hyderabad sees record registrations
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి గాడిలో పడింది. గత ఏడాది చివరి నెల డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 3176 కోట్ల రూపాయల విలువైన 6311 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ నెలతో పోల్చుకుంటే 2.4 శాతం ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.
గత ఏడాది మొత్తంగా 33,605 కోట్ల రూపాయల విలువైన 68,519 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ లో భాగమైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా ఎసెస్ మెంట్ ప్రకారం 25 లక్షల నుంచి 50 లక్షల విలువ చేసే రెసిడెన్షియల్ యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 54 శాతంగా ఉన్నాయి. గత ఏడాదిలో 25 లక్షల రూపాయలు దాటిన రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువుగా జరిగాయి. 25 లక్షల రూపాయలకు తక్కువుగా ఉన్న స్థలాల రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి మొత్తం కేవలం 17 శాతంగానే ఉంది. 2021లో 40 శాతంగా ఉన్న ఈ లావాదేవీలు 2022 నాటికి చాలా వరకు తగ్గాయి.
స్థలాల కొనుగోళ్లు కన్నా పూర్తిగా నిర్మాణమైన భవనాలను, ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ముంబై, పూణె, బెంగళూర్, కోల్ కతా వంటి ప్రాంతాల్లో స్టాంపు డ్యూటీలో రిబేట్లు ప్రకటించడం ద్వారా అమ్మకాలను పెంచుకుంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో అటువంటి రిబేట్లు ఏవీ లేకుండానే అమ్మకాలు, కొనుగోళ్లు శర వేగంగా జరుగుతున్నాయి.