Hyderabad police clarity on murder conspiracy of Pawan Kalyan: జనసేన అధినేత పవన్ హత్యకు కుట్ర జరిగిందని ఆయన వెంట అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తున్నారంటూ ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ ఛానల్ అయితే ఏకంగా పవన్ హత్యకు కుట్ర పన్నారని 250 కోట్ల రూపాయలతో సుపారి కూడా ఇచ్చారంటూ ఒక కథనాన్ని సైతం ప్రచారం చేసింది. అయితే తాజాగా పోలీసులు ఇవన్నీ నిజం కాదని తేల్చారు. జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరిపి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద వారు ఎలాంటి రెక్కీ నిర్వహించలేదని, దాడికి సైతం కుట్ర జరగలేదని వెల్లడించారు. ఆదిత్య విజయ్, వినోద్, సాయి కృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు దగ్గరలో ఉన్న ఒక పబ్లో మద్యం సేవించి తాగి వస్తూ పవన్ ఇంటి వద్ద కారు నిలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వచ్చి కారు అక్కడ నుంచి తీసివేయాలని కోరడంతో గొడవ మొదలైందని పోలీసులు వెల్లడించారు.
సదరు ముగ్గురు యువకులు తాము మద్యం మత్తులో ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డామని పేర్కొన్నారు. ఇక వారు తిరుగుతున్న గుజరాత్ రిజిస్ట్రేషన్ కారు ఆ ముగ్గురిలో ఒకరైన సాయి కృష్ణదని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో జనసేన కార్యకర్తలు ఆందోళనకు సిద్ధమయ్యారు. రోడ్ నెంబర్ 36 లో ఉన్న తబలా రాస అనే పంపు మూసివేయాలని వారు ధర్నాకు సిద్ధమయ్యారు. ఆ పబ్ జనావాసాల మధ్యలో ఉందని అక్కడ నుంచి మరోచోటికి తరలించారని జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ ధర్నా చేసేందుకు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ రోడ్డులో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వారిని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జనసేన కార్యకర్తలు హైదరాబాద్లో పబ్ కల్చర్ అరికట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.