Microsoft Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్
Microsoft Hyderabad:: అమెరికా టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో భారీ డేటా సెంటర్ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రాబోయే 15 ఏళ్లలో రూ. 15వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ముంబై, పుణె, చెన్నై తర్వాత దేశంలో మైక్రోసాఫ్ట్‌కు ఇది నాలుగో డేటా సెంటర్ అవుతుంది. భారత పర్యటనలో ఉన్న హైదరాబాదీ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చాలా కాలం తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని సత్య నాదెళ్ల నివాసానికి వెళ్లి కలిశారు.
దాదాపు అరగంటపాటు అల్పాహార సమావేశం సాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు సంబంధించి చర్చించినట్టు తెలిసింది. బిజినెస్, బిర్యానీ గురించి సత్య నాదెళ్లతో మాట్లాడానంటూ మంత్రి కేటీఆర్ సరదాగా ట్వీట్ చేసినా.. ఆ సమావేశం తెలంగాణ ఐటీ అభివృద్ధి దిశగా సుదీర్ఘంగా సాగింది. హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ ఏర్పాటుచేస్తున్న అతిపెద్ద డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు సత్య నాదెళ్ల.
ఈ భేటీ సందర్భంగా ఈ అంశాలపై ఇరువురు చర్చించినట్టు తెలిసింది. కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. కాగా కేటీఆర్ సత్య నాదెళ్లతో ఉన్న చిత్రాలను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు.