Wildlife Photographer: అరుదైన ఘనత సాధించిన హైదరాబాద్ ఫోటోగ్రాఫర్
హైదరాబాద్కి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ అరుదైన ఘనత సాధించాడు. వన్యప్రాణులను ఫోటోలను తీసే ఈ యువకుడు ఓ మైలురాయిని చేరుకున్నాడు. భారతదేశంలో గుర్తింపబడిన 1350 పక్షుల్లో 1000 పక్షుల ఫోటోలను తీయగలిగాడు. తద్వారా అటువంటి ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. మన దేశంలో ఈ ఘనత సాధించిన 25వ వ్యక్తిగా నిలిచాడు.
హైదరాబాద్లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీరాంరెడ్డి పక్షి ప్రేమికుడు. చాలా కాలం నుంచి తన కెమెరాతో అరుదైన పక్షిజాతి ఫోటోలను సేకరిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన లడక్ వెళ్లిన శ్రీరాంరెడ్డి అక్కడ ఓ వైట్ బ్రౌడ్ టిట్ వేబ్లర్ ఫోటోను తీయడం ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
మనదేశంలో శశాంక్ దాల్వీ అనే వ్యక్తి పక్షుల ఫోటోలు తీయడంలో అందరికంటే ముందున్నాడు. ఇప్పటి వరకు 1350 గుర్తింపబడిన పక్షుల్లో 1240 ఫోటోలను క్లిక్ చేశాడు.
2015 లో ప్రయాణం ప్రారంభం
శ్రీరాంరెడ్డి 2015లో తన ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పటి వరకు మన దేశంలో 22 రాష్ట్రాలు తిరిగాడు. 1013 పక్షుల ఫోటోలను తీశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పర్యటనలు చేసిన శ్రీరాం ఆంధ్రాలో 378, తెలంగాణలో 408 పక్షి జాతి ఫోటోలు తీశాడు. తెలంగాణలో ఉన్న 442 పక్షి జాతుల్లో 408, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 470 పక్షిజాతుల్లో 378 పక్షులను తన కెమెరాలో బంధించాడు.
2015లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీరాం ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించాడు. అమెరికా, వియత్నాం వంటి దేశాల్లో కూడా పర్యటించాడు. అక్కడ సంచరించే అరుదైన పక్షిజాతులను తన కెమెరాలో బంధించాడు. మనదేశంతో పాటు విదేశాల్లో కూడా తీసిన ఫోటోల సంఖ్యను లెక్కిస్తే ఆ సంఖ్య 1107కి చేరింది.
తదుపరి లక్ష్యం
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీరాం త్వరలోనే మరిన్ని ప్రాంతాలను వెళ్లనున్నాడు. ఆఫ్రికా దేశాలతో పాటు దక్షిణ అమెరికా దేశాలలో కూడా తన పాదం మోపనున్నాడు. వాటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సందర్శించని పలు ప్రాంతాల్లో కూడా ప్రయాణం చేయనున్నాడు. ఈ రంగంలో ఆసక్తిగల యువతీ యువకులకు గైడెన్స్ కూడా ఇవ్వనున్నాడు.