Hussain Sagar : భారీ వర్షాలు… నిండిపోయిన హుస్సేన్ సాగర్
Hussain Sagar crosses full tank level : వరుసగా ఐదో రోజు మంగళవారం కూడా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఇక నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు వస్తుండటంతో మంగళవారం నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్) దాటింది. హుస్సేన్ సాగర్‌లో గరిష్ట నీటి మట్టం 514.75 మీటర్లు కాగా, ఎఫ్టిఎల్ 513.41 మీటర్లకు గాను 513.44 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లోని లేక్స్ విభాగం హుస్సేన్ సాగర్‌లోని నీటి మట్టాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖలకు అప్డేట్ చేస్తోంది. మూసీ నదిలో కలుస్తున్న బయటి కాలువలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) హుస్సేన్ సాగర్ గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని వదులుతోంది.
కాగా భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సెలవు ప్రకటించడంతో రెండో రోజు కూడా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మెంట్, జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.