HMDA Plan to ORR Lease: లీజుకు ఔటర్ రింగ్ రోడ్… భారీగా నిధుల సమీకరణకు హెచ్ఎండీఏ ప్లాన్
HDDA plan to lease ORR: హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసిన తరువాత ప్రయాణం మరింత సులభతరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఔటర్ రింగురోడ్డుపై అనేక ప్రాంతాల్లో టోల్ గేట్లు ఏర్పాటు చేశారు. దీని ద్వారా భారీగా ఆదాయం ఆదాయం ఆర్జిస్తున్నది. అయితే, ఓఆర్ఆర్ ను లీజుకు ఇవ్వడం ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కూడా హెచ్ఎండీఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల వరకు ఓఆర్ఆర్ ను లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా లీజుకు ఇవ్వడం ద్వారా రూ. 6 వేల కోట్లు నుండి 7 వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించాలని చూస్తున్నారు.
ఇందులో భాగంగానే పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్, ఇతర కార్యకలాపాలను, నిర్వహణను చేపట్టాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీనికోసం బిడ్డర్లను కూడా ఆహ్వానించింది. గచ్చిబౌలి నుండి నగరం చుట్టూ రింగ్ రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ రింగ్ రోడ్డు ఏర్పాటుతో కమర్షియల్ రవాణా వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నాయి. కాగా, త్వరలోనే ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో ఔటర్ రింగ్ రోడ్డు కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఔటర్ రింగు రోడ్డును లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే నిధులతో నగరంలో మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టాలని హెచ్ఎండీఏ చూస్తున్నది.