Rain in Hyderabad: మారిన వాతావరణం… నగరంలో భారీ వర్షం
Heavy Rains in Hyderabad: మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. బయటకు వెళ్లాంటే భయపడే విధంగా ఎండలు మండిపోయాయి. ఉదయం ఆరు గంటల నుండే వేడి మొదలుకావడంతో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి కారుమబ్బులు కమ్ముకొన్నాయి. గురువారం సాయంత్రం నుండి వాతావరణంలో మార్పులు వచ్చాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురవడం మొదలైంది. భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వరదను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని వర్షం కురవడంతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. ఈ వర్షాలు మార్చి 18 వరకు ఉంటాయని, మార్చి 20 వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలియజేశారు.
ఇక, నగరంలో వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం ఈవిధంగా ఉంది. టోలిచౌక్‌లో 9.1 సెంమీ, రాజేంద్రనగర్ శివరాంపల్లిలో 6.3 సెంమీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.1 సెంమీ, కుత్భుల్లాపూర్ జీడిమెట్ల గాయత్రీనగర్‌లో 5.3 సెంమీ, కాజాగూడాలో 5.3 సెమీ, శంకర్‌పల్లి పొద్దుటూరులో 5.2 సెంమీ, జూపార్క్ వద్ద 5.1 సెంమీ వర్షపాతం నమోదైంది. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.