Hyderabad Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం..నిండు కుండలా జంట జలాశయాలు..!
హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి.నివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉండటంతో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి పలుచోట్ల ట్రాఫిక్ జామైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల రోడ్లపై డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి.మరోవైపు నగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి.
నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో మాన్ సూన్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. సిబ్బంది ఫీల్డ్ లెవెల్ లో ఉండాలని ఆదేశించింది. భారీగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలు వరద నీటితో పోటెత్తాయి. దీంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు అధికారులు. ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉంది. గండిపేట జలాశయంకూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి 4అడుగుల దూరంలో ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,786 అడుగులు మేర నీరు ఉంది. 2 గేట్లు తెరిచి నీరు విడుదల చేశారు.
హుస్సేన్ సాగర్ భారీ వరద ప్రవాహాంతో తొణికిసలాడుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.50 మీటర్లుగా ఉంది. గరిష్ట నీటి మట్టానికి మరో మీటరు దూరంలో ఉండటంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉపరితల ఆవర్తనానికి తోడు షియర్ జోన్ ఏర్పడటం, రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని జీహెచ్ ఎంసీ అధికారులు సూచించారు.
తెలంగాణలో పలు జిల్లాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని అన్ని జలాశయాలు నిండు కుండల్లా మారిపోయాయి. వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.