Hyderabad : హైదరాబాద్ లో వర్ష బీభత్సం
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదలడం లేదు వర్ష బీభత్సం తో నగరాన్ని అతలాకుతలం చేసాడు. కుండపోత వర్షంతో జంట నగరాలూ జలదిగ్బంధమయ్యాయి. శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు కురిసిన కుంభవృష్టి వర్షంతో భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోయారు. వర్షం ధాటికి కాలనీలు, రోడ్లన్నీ పూర్తిగా నదులుగా మారాయి. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా అంతలోపే నగరాన్ని మబ్బులు కమ్మివేయడంతో పూర్తి అంధకారం చోటుచేసుకుంది.
నగరంలోని పలు ప్రాం తాల్లో కేవలం గంట వ్యవధి లోనే 5 నుంచి 10 సెం.మీ. మేర వర్షం కురిసింది. దీంతో పలు ఎరియాల్లోని కాలనీలు నీట మునగడంతో ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే గ్రేటర్ అధికారులు సహాయక చర్యలకై రంగంలోకి దిగారు. పంజాగుట్ట, అమీర్పేట, ఎర్రగడ్డ,మియాపూర్, మాదాపూర్,కోటి,సికింద్రాబాద్, బేగంపేట్ కొండాపూర్లో వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్లియర్ కావడానికి దాదాపుగా 5 గంటలకు పైగా సమయం పట్టింది.
మల్కాజ్గిరి 7.3 సె.మి., మల్కాజ్గిరిలో 6.7, తిరుమల్గిరి 6.3, హయత్నగర్ 6.2,కాప్రా 6.8, కుషాయిగూడ 5.9, అల్వాల్ 5.8, మధుసూధన్నగర్ 5.6, ఫతేనగర్ 5.5, వెస్ట్ మారెడ్పల్లి 5.3, బేగంపేట్ 5.0, మొండా మార్కెట్ 4.7, సీతాఫల్ మండి4.6, ఫికెట్ 4.5, కుత్బుల్లాపూర్ 4.5,మౌలాలి 4.5, బాలానగర్ 4.2, వనస్థలిపురం 4.0 సె.మి.వర్షపాతం నమోదైంది. మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.