Haryana Bawaria Gang: హైదరాబాద్ చైన్ స్నాచింగ్ వెనుక ఖాకీ సినిమా గ్యాంగ్?
Haryana Bawaria Gang Included in Hyderabad Chain Snatchings: హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు ఒక్కసారిగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒకేరోజు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆరు ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండగులు ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తాన్ని షాక్ కి గురి చేశారు. అయితే ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ అంశం ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. వీరందరినీ హైదరాబాద్ పోలీసులు ఇప్పటికీ ట్రేస్ చేయలేకపోయారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు చెబుతున్న దాని ప్రకారం వీరంతా హర్యానా బవేరియా గ్యాంగ్ కి చెందిన సభ్యులు అని తెలుస్తోంది. చైన్లు తెంపుకున్న తర్వాత వీరంతా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కి వెళ్లి బస్సు ఎక్కి ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు.
అలాగే సీసీటీవీ ఫుటేజీల్లో నలుగురు దుండగులు ఉండగా దోపిడీకి వచ్చింది కూడా నలుగురు దుండగులని పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు హైదరాబాద్ కలిసి వచ్చారని వచ్చిన తర్వాత ఒక పల్సర్ బైక్, ఒక యాక్టివా చోరీ చేసి దొంగతనాలకు పాల్పడ్డారని గుర్తించారు. గతంలో హర్యానా బవేరియా గ్యాంగ్ మీద మూడు కమిషనరేట్ ల పరిధిలో 80 వరకు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. వాటికి ఇప్పుడు అదనంగా మరో ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
అయితే ఈ హర్యానా బవేరియా గ్యాంగ్స్ ఒకప్పుడు తమిళనాడు ప్రాంతంలో కలకలం సృష్టించాయి. కనపడిన వారి దగ్గర బంగారం తెంపుకొని వెళుతూ వాళ్ళని దారుణంగా చంపేస్తూ వీరు రెచ్చిపోయారు. ఇదే అంశాలను బేస్ చేసుకుని తమిళంలో కార్తీ హీరోగా ఖాకీ అనే సినిమా కూడా తెరకెక్కించారు. అది తెలుగులో కూడా విడుదలై మంచి హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో చూపించిన గ్యాంగ్ ఇంకా యాక్టివ్గా ఉందని పలు రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్ కి కూడా పాల్పడుతోందని చెబుతున్నారు.
మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ విషయంలో ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. వారిని ఎప్పుడు పట్టుకుంటారు? ఎలా పట్టుకుంటారు? అంటూ ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రెషర్ వారి మీద ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరికి హైదరాబాద్ పోలీసులు వారిని ఎప్పటికీ పట్టుకుంటారు? ఒకవేళ పట్టుకున్నా బంగారాన్ని రికవరీ చేయగలుగుతారా లేదా అనేది.