శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీస్‌శాఖ అమల్లోకి తెస్తున్న వినూత్న చర్యలు సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు
Sahas: శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీస్‌శాఖ అమల్లోకి తెస్తున్న వినూత్న చర్యలు సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. వర్క్ ప్లేస్‌లో మహిళా ఉద్యోగినుల భద్రతపై రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం సాహస్ ను డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ శిఖా గోయల్‌లతో కలిపి హోమ్ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. వర్క్ ప్లేసెస్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులను సాహస్తో అరికట్టేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రభుత్వ పరిశ్రమల భాగస్వామ్యంతో చేపట్టే వినూత్న కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
పనిచేసే చోట మహిళా ఉద్యోగినులు లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ‘సాహస్’ మైక్రోసైట్, సాహస్ సాథీ చాట్ బోట్, సాహస్ వాట్సాప్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీస్ శాఖలో అత్యధిక మహిళా పోలీస్ అధికారులున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధి గాంచిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ మారుమూల పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కనీసం ఏడెనిమిది మంది మహిళా పోలీస్ అధికారులున్నారని వారు అత్యంత సమర్థంగా విధుల్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు.
సాహస్ వల్ల పనిచేసే చోట మహిళా ఉద్యోగినులకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు నుండి నాలుగు లక్షల మందికి పైగా మహిళా ఉద్యోగులు వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిపారు. సాహస్టీంలోని సభ్యులు ఈ అందరు ఉద్యోగులతో మాట్లాడటం ద్వారా సమస్యల పట్ల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. సాహస్స్టీరింగ్కమిటీ మహిళా ఉద్యోగినుల్లో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, పోలీసులకు ఎలా ఫిర్యాదులు చేయవచ్చన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని చెప్పారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయల్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులు ఉన్న రాష్ట్రం మనదే అని చెప్పారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ శాంతిభద్రతలు సురక్షితంగా ఉండటమే అని తెలిపారు. మహిళా ఉద్యోగినుల భద్రత, సమస్యల పరిష్కారం కోసం అమల్లోకి తీసుకువచ్చిన సాహస్కార్యక్రమం దేశంలోనే మొదటిదన్నారు.