Governor Vs TS Govt: ఎవరూ తగ్గడంలేదు…గొడవ ఆగేలా లేదు
Governor Vs TS Govt: రాష్ట్రప్రభుత్వానికి, రాజ్ భవన్‌కు మధ్య దూరం క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ఎమ్మెల్సీగా ఎన్నికల సమయంలో ఈ దూరం పెరగడం మొదలైంది. క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ఏ విధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని అని గవర్నర్ నిరాకరించడంతో రాష్ట్రప్రభుత్వం, గవర్నర్ మధ్య దూరం పెరగడం మొదలైంది. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు గవర్నర్‌ను ఆహ్వానించడం లేదు. జాతీయ వేడుకల సమయంలో రాజ్‌భవన్‌కు రాష్ట్రప్రభుత్వం తరపున అధికారులు తప్పించి సీఎం, మంత్రులు దూరంగా ఉంటున్నారు.
మరోవైపు రాజ్ భవన్‌లో గవర్నర్ ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా రాజ్‌దర్బార్‌ను ఏర్పాటు చేసి వారి సమస్యలు వింటున్నారు. ఇది రాష్ట్రప్రభుత్వానికి ఏమాత్రం నచ్చడం లేదు. గవర్నర్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ఇవ్వవలసిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని గవర్నర్ ఆరోపించారు. సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో గవర్నర్ రోడ్డు మార్గం ద్వారానే జాతరకు చేరుకున్నారు. జాతర సమయంలో ఇవ్వవలసిన ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బహిరంగంగా తప్పుపట్టారు గవర్నర్. గవర్నర్ పై అటు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు సైతం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో ఆ ప్రాంతంలో పర్యటిస్తానని గవర్నర్ చెప్పిన తరువాత రాష్ట్రప్రభుత్వంలో కదలికలు వచ్చాయి. వెంటనే అటు సీఎం కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లారు. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, గవర్నర్‌కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని గవర్నర్ ప్రతివిమర్శలు చేశారు.
ఈ విమర్శలు ప్రతి విమర్శల జరుగుతుండగానే, అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల సమయంలో ప్రభుత్వం బిల్లులను ఆమోదం తెలిపి గవర్నర్ వద్దకు పంపారు. కాగా, ఆ బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆమోదం తెలపాలని ప్రభుత్వం కోరినా, తనకు బిల్లులపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. దీంతో గవర్నర్‌కు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య దూరం మరింత పెరిగింది. ఈ దూరం తగ్గుతుందా లేదా అనుకునే సమయంలో బడ్జెట్ సమావేశాల నిర్వహించాల్సి ఉండగా, రాష్ట్రప్రభుత్వం హైకోర్టును సంప్రదించింది. బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా గవర్నర్ సమావేశాల నిర్వాహణకు సంబంధించి అనుమతులు ఇవ్వడం లేదని అంటూ హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.
అయితే, హైకోర్టు ఈ విషయాన్ని ఇరు పక్షాల న్యాయవాదులు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం కనుగొనాలని సూచించారు. హైకోర్టు సూచనల మేరకు రాజీ పడటంతో సమావేశాలు సజావుగా సాగాయి. ప్రభుత్వం తరపున సీఎం గవర్నర్‌ను ఆహ్వానించారు. ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయని అనుకున్నారు. ఆ సమావేశాల సమయంలో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రతిని గవర్నర్ చదివారు. సమావేశాల అనంతరం బడ్జెట్‌కు సంబంధించిన పద్దుల బిల్లును గవర్నర్ ఆమోదం తెలిపారు.
కాగా, ఇంకా అనేక బిల్లులు రాజ్ భవన్‌లో గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. తన అనుమానాలు నివృత్తి చేస్తే ఆమోదిస్తానని గవర్నర్ చెబుతుండగా, రాష్ట్రప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేసింది. కోర్టుకు వెళ్లే బదులుగా రాజ్‌భవన్‌కు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంపై ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.