Governor on Preeti Suicide Case: ప్రీతి ఆత్మహత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు… అన్ని కోణాల్లో విచారణ జరపాలి
Governor on Preeti Suicide Case: వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైద్య కళాశాలలో ర్యాంగింగ్ భూతానికి విద్యార్థిని బలికావడంతో రాజకీయ, సామాజికవేత్తలు ఇప్పటికే సంతాపంతో పాటు, ర్యాగింగ్ పై చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. కాగా, తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని కాపాడేందుకే ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని కాళోజీ హెల్త్ యూనివర్శిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్శిటీల్లో ర్యాగింగ్ రోజు రోజుకు పెరిగిపోతుందని, దానిని అరికట్టాలంటే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు.
ప్రీతి ఆత్మహత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని ఆమె ఆదేశించారు. విచారణ చేపట్టి సమగ్ర నివేదికను అందించాలని విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ కు లేఖ రాశారు. దొషుల్ని శిక్షించేందుకు సాధ్యమైన అన్ని కోణాల నుండి విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. ప్రీతి ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన రోజే మరణించి ఉంటుందని ఆమె తండ్రి తెలిపారు. నిందితులను కాపాడేందుకే అధికారులు ఈ నాటకాలు ఆడారని ప్రీతి తండ్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. ర్యాగింగ్ పేరుతో వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రీతి తండ్రి పేర్కొన్నారు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఈ విధంగా ఉండేవి కాదని అన్నారు.