GHMC: అగ్ని ప్రమాదాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్
Special Drive on Fire Accidents: హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాల పై మంత్రి కెటి రామారావు నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదాలపై లోతుగా చర్చించామని తెలుస్తోంది. అక్రమ కట్టడాలు, ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమించినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను కూడా పరీశీలిస్తుందని త్వరలోనే స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తామని కూడా ఆయన అన్నారు. అగ్ని మాపక యంత్రాలు వెళ్లలేని స్థితిలో ఉన్నపుడు వాడుకోవాల్సిన సాంకేతికత పై కూడా చర్చించామన్న ఆయన అగ్ని ప్రమాదం జరిగిన నల్ల గుట్ట భవనాన్ని కూల్చేందుకు టెండర్ పిలిచామని 41 లక్షల రూపాయలకు టెండర్ ఖరారైందని అన్నారు. రేపటి నుంచి కూల్చి వేత ప్రారంభిస్తామన్న తలసాని చిన్న పరిణామంలో ఉండే అగ్ని మాపక యంత్రాలను భవిష్యత్ లో వినియోగించేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు. అలాగే భవనాల్లో సామర్ధ్యానికి మించి వస్తువుల నిల్వ వల్ల అగ్ని ప్రమాదాల ఉధృతి పెరుగుతోందని , భవిష్యత్ లో అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉన్న ఫళంగా అక్రమ కట్టడాలను తొలగించలేమన్న ఆయన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక నల్ల గుట్ట అగ్ని ప్రమాదం లో మృతులకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని అన్నారు.