G 20 Economic Summit: నేటి నుండి భాగ్యనగరంలో జీ 20 ఆర్థిక సదస్సు
G 20 Economic Summit: ఈ రోజు నుండి మూడు రోజులపాటు భాగ్యనగరంలో జీ 20 దేశాల సన్నాహక సదస్సులు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే జీ 20 దేశాల సదస్సులో భాగంగా సన్నాహక సమావేశాలను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు. గత నెలలో ఒకమారు హైదరాబాద్‌లో జీ 20 దేశాల సన్నాహక సదస్సు నిర్వహించారు. కాగా, నేటి నుండి మూడు రోజుల పాటు ఆర్థిక సదస్సు జరగనున్నది. దక్షిణ దేశాలలో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాథలు అనే అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సులో 40 దేశాల నుండి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు.
భారత దేశం డిజిటల్ పేమెంట్స్ అంశంపై చర్చించనున్నది. భాగ్యనగరంలోని హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. దేశంలోని డిజిటల్ పేమెంట్స్‌లో 40 శాతం మేర యూపీఐ ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి. ఈ చెల్లింపులను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. 2030నాటికి భారత్ లక్ష్యాలను కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ ఆర్థిక రంగంతో పాటు ఆహార రంగంలో కూడా భారత్ ఏ విధంగా విజయం సాధిస్తున్నది, చిరుధాన్యాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నదనే అంశాలను కూడా ఈ సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.