Krishnam Raju: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు అసుపత్రిలో జాయిన్ అయ్యారు. అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటన్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక మరికాసేపట్లో కృష్ణంరాజు పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని తన నివాసంకు తరలించనున్నారు. ప్రజలు ,అభిమానులు చివరి చూపుల కోసం మధ్యాహ్నం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంకు కృష్ణంరాజు పార్థివదేహాన్ని తరలించనున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరుపనున్నారు.