Fire Accident in Rajendra Nagar: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident in Rajendra Nagar: హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మంటలు ఎగసిపడుతున్నాయి. రాజేంద్రనగర్‌లోని శాస్త్రీపురంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు ఎగసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాధమిక అంచనాకు వచ్చారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వెంటనే దాదాపు 10 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. గోదాములో పార్క్ చేసిన రెండు డీసీఎం వాహనాలు పూర్తిగా దగ్దమయ్యాయి.
ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల వారిని అక్కడి నుండి ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తరువాత విచారణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు. గోదాం పక్కనే స్కూల్ ఉండటంతో వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఈ స్కూల్‌లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మరోచోట అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, కానీ, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.