Crescent Cricket Cup: ఫిబ్రవరి 26న సినీ తారల క్రికెట్ సమరం
Film Stars Cricket Match in Hyderabad
సినీ ప్రియులకు కిక్ ఇచ్చే అరుదైన, అద్భుత కార్యక్రమం ఒకటి ఫిబ్రవరి 26న జరగనుంది. ఆ రోజున హిందీ, తెలుగు సినీ రంగాలకు చెందిన నటీ నటులు రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. సే నో టూ డ్రగ్స్ అనే నినాదంతో జరుగుతున్న క్యాంపైనింగ్ కోసం ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
తెలుగు పరిశ్రమ నుంచి హీరోలు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీశ్, తారక రత్న ఉన్నారు. వారితో పాటు సీనియర్ నటుడు ప్రభాకర్, ఆలీ తమ్ముడు ఖయ్యుమ్, రవి ప్రకాశ్ వంటి నటులు కూడా క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఇక సింగర్స్ రేవంత్, శ్రీరామచంద్ర, వీజే సన్ని, యాంకర్ రవి, బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ తదితరులు తెలుగు పరిశ్రమ నుంచి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు.
ఇక హిందీ నటుల్లో అర్భాజ్ ఖాన్, అఫ్తాబ్ శివదాసానీ, షవర్ అలీ, అభిషేక్ కపూర్, కునాల్ వర్మ, రోహన్ మెహతా తదితరులు సీసీసీలో ఆడనున్నారు.
గతంలో కూడా ఇటువంటి సరదా మ్యాచులు చాలానే జరిగాయి. హిందీ, తెలుగు సినీ రంగాలకు చెందిన క్రికెటర్లు బరిలో దిగి క్రికెట్ ఆడుతుంటే చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, శ్రీకాంత్, ప్రిన్స్ తదితరులు కూడా 2015లో ఓసారి క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ కు అద్భుత స్పందన లభించింది. చిరంజీవి ఔటవ్వగానే ఓ నటీమణి భోరున విలపించడం కూడా ఆ నాటి మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది.