TSPSC: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరిన్ని పేపర్లు
TSPSC: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాలకు సంబంధించి రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీకేజీకు సంబంధించిన ప్రధాన నిందితుడైన ప్రవీణ్ లీలలు తోడుతుంటే కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సిట్ అధికారులు విచారణ జరుపు తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారం తాజాగా మరో కీలక మలుపు తీసుకుంది. కేవలం ఒక పేపర్ కాదు.. ఏకంగా నిందితుడు ప్రవీణ్ మొత్తం పదిహేను పరీక్ష పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లుగా సిట్ విచారణలో తేలినట్లు సమాచారం.
గ్రూప్-1, డీఏవో, ఏఈ, టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ, ఎంవీఐ, గ్రౌండ్ వాటర్, జనరల్ స్టడీస్, ఈ ఏడాది జరగనున్న జూనియర్ లెక్చరర్ ప్రశ్నపత్రాలు ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో సిట్ అధికారులకు లభించినట్లు టీఎస్‌పీఎస్‌సీ కి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. ఇవే కాకుండా వివిధ సబ్జెక్టుల పేపర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రవీణ్ పేపర్ లీకులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌కు లబ్ధి చేకూర్చేందుకు టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్ లాన్‌లో రాజశేఖర్ పలు మార్పులు చేసినట్లు తెలిసింది. రాజశేఖర్ సహాయంతోనే ప్రవీణ్ పేపర్ బాంచ్ కొట్టేసినట్లు తెలిసింది. తనదగ్గరున్న పెన్‌డ్రైవ్‌లో ఆ పేపర్లని ప్రవీణ్ సేవ్ చేసుకున్నట్లు తెలిసింది. పేపర్ లీకేజీ కేసులో నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అలాగే కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు కూడా ఈ కేసులో వినపడుతున్నాయని సమాచారం.