Hyderabad:హైదరాబాద్‌లో ఫారన్ కంట్రీ ఇళ్లు
Secunderabad West Maredupalli: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు యూరోపియన్ దేశాల్లోని ఇళ్లను తలపిస్తున్నాయి. ఫారన్ దేశాల వలే భిన్నమైన నిర్మాణ శైలి అందుకు కారణంగా చెప్పవచ్చు. నగరంలో సరికొత్త థీమ్‌లతో విల్లాలు వెలుస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే యూరోపియన్ స్టైల్లో ఇళ్ల నిర్మాణం హైదరాబాద్ నగరానికి పరిచయం చేశాయి ఇండస్ట్రియల్ సంస్థలు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ కేంద్రానికి సమీపంలోని వెల్లింగ్టన్ కాలనీతో గేటెడ్ కమ్యూనిటీ ప్రయోజనాలను ముందుగానే నగరవాసులకు పరిచయం చేసింది.
యూరోపియన్ తరహా ఇళ్లకు పైకప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పైకప్పు ఏటవాలుగా.. పొడవైన కిటికీలు, ఆర్చ్ ఓపెనింగ్‌తో చూడగానే ఆకట్టుకునే శైలిలో కనిపిస్తుంటాయి. ఆయా దేశాల్లో సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచు కురుస్తుంది కాబట్టి అది ఇళ్లపై పేరుకు పోకుండా కిందకు జారిపోయేలా ఈ తరహా ఇళ్లు కట్టుకుంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు మనవాళ్లను ఈ తరహా ఇళ్లు ఆకట్టుకున్నాయి. సిటీలో అక్కడక్కడ ఇలాంటివే కనిపిస్తున్నాయి. ఒక కమ్యూనిటీకి మాత్రం వెల్లింగ్టన్ కాలనీ ఇప్పటికీ ప్రత్యేకత చాటుతోంది.
ప్రముఖ సంస్థ 1998లో యూరోపియన్ తరహాలో ఇళ్లు నిర్మించారు. ఇక్కడ మొత్తం 15 భవనాల్లో 29 విల్లాలు కనిపిస్తాయి. మనకు మంచు కురియకపోయినా.. వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయి. బల్లపరుపుగా ఉండే శ్లాబుపై వేడి నిటారుగా పడుతుంది. ఇక్కడ పైకప్పు ఏటవాలుగా ఉండటమే కాదు టైల్స్ ఏర్పాటు చేయడంతో వేడిని అంతగా లోపలికి రానివ్వదు. చల్లగా ఉంటుందని, న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ నగరంలోని ఇళ్ల స్ఫూర్తితో ఇక్కడ తాను ఇక్కడ ఇల్లును నిర్మించుకున్నట్లు తెలిపారు.
220 చదరపు అడుగుల్లో డూప్లెక్స్ ఇళ్లను ఇక్కడ నిర్మించినట్లు, అన్నీ కూడా ఒకే విధంగా వరసగా కట్టడం ఎక్కువ మందికి నచ్చుతోందని, రెండేసి విల్లాలు కలిపి ఒక నిర్మాణంగా చేపట్టినట్లు తెలిపారు. విల్లాలను కలుపుతూ ప్రహరీ ఉంటుందని, ముందువైపు ప్రహరీ అడ్డుగోడలు లేకుండా పచ్చదనం పెంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. దీనిని చూడగానే ప్రతీ ఒక్కరు విదేశాల్లో ఉన్నామనే భావన కలిగేలా రహదారులు, వీధి దీపాలు సాదర స్వాగతం పలుకుతుంటాయి. పూల చెట్లు, పక్షుల కిలకిలారావాలు నివాసితులకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి.