Etela: పేపర్ లీకేజీ యాదృచ్ఛికమా! ఇంటెన్షనా? సీఎం సమాధానం చెప్పాలి – ఈటల
Etela rajender attacks CM KCR on Paper leak issue
తెలంగాణ పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. లక్షలాది మంది అభ్యర్ధులు లబోదిబోమంటున్నారు. పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. రాత్రనకా పగలనకా కొన్ని నెలల పాటు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక విద్యార్ధి సంఘాల నాయకులు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును ఎండగడుతున్నారు. కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా పోరాటానికి దిగింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. విద్యార్థుల కళ్ళలో కేసీఆర్ మట్టి కొట్టారని ఈటల రాజేందర్ విమర్శించారు. 2014లో కేసీఆర్ అధికారం చేపట్టన తర్వాత లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చారని…ఆ దిశగా పనులు జరగడం లేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క పరీక్ష కూడా లీక్ కాకుండా జరగలేదు అంటేనే కేసిఆర్ కు విద్యార్థుల మీద ఆసక్తి ఎంతో అర్థం అవుతోందని అన్నారు.
తల్లి తండ్రులు అనేక ఇబ్బందులు పడి పిల్లల్ని చదివిస్తున్నారని, వాళ్ళందరికీ కేసీఆర్ ఈరోజు కన్నీళ్లు తెప్పిస్తున్నారని ఈటల గుర్తుచేశారు. పరీక్షల రద్దు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకేజీ యాదృచ్ఛికమా! ఇంటెన్షా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏవీఎన్ రెడ్డి ఎలా గెలిచారు అనే దాని మీద ఉన్న ఆసక్తి పేపర్ లీకేజీ రివ్యు మీద లేదని ఈటల మండిపడ్డారు.
దీనికి సీఎం నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులందరూ రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిట్టింగ్ జడ్జితో ఈ లీకేజీ వ్యవహారాన్ని విచారణ చేయించాలని డిమాండ్ చేశారు