E- Vehicles: నగరంలో నేడు విద్యుత్ వాహనాల ర్యాలీ.. పాల్గొననున్న మంత్రి కేటీఆర్
E-Vehicles: దినదినాభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్దికి ప్రాధాన్యతనివ్వడం సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో వాహన సంఖ్య పెరగడంతో వాహన కాలుష్యం అంతే పెరిగింది. వాహన కాలుష్యం, చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నారు. విద్యుత్ వాహనాల వాడకం.. వాటి తయారీని ప్రోత్సహిస్తూ.. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా, టెస్ట్ రన్‌లో వీటి పనితీరు భేష్‌గా ఉన్నట్లు రుజువైంది.
రాబోయే 2030 నాటికి అన్ని రకాల ఈ -వెహికిల్స్ ను ఎక్కువ శాతం వినియోగానికి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పాలసీ రూపొందించి ఎలక్ట్రికల్ వాహనాల కంపెనీల ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేసున్నది. ఇదిలా ఉంటే ఈవీ రంగానికి మరింత ఊతమిచ్చేలా నేటి నుంచి ఈ మొబిలిటీ వారోత్సవాలను నిర్వహిస్తోంది సర్కారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలో ఈవీ వాహనాల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఇక ఆర్టీసీ సైతం నగరంలో కాలుష్య రహిత సిటీ బస్సులు నడిపించేందుకు కార్యాచరణ చేపట్టింది. ఈ ర్యాలీ పీపుల్స్‌ప్లాజా, మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి సాయంత్రం 3 గంటలకు ఈవీ వాహనాల ర్యాలీ ప్రారంభమై హైటెక్ సిటీ మెటల్ చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ మంత్రి కేటీఆర్ ఈవీ ర్యాలీలో పాల్గొని హైటెక్స్ సభావేదికకు చేరుకుంటారు.