EV Charge Stations: గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు
EV Charge Stations: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విద్యుత్ వాహనాలను మరింత ప్రొత్సహించేందుకు జిహెచ్‌ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల ను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. చమురు వినియోగాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల ఖరీదు ఎక్కువైనా పెరుగుతున్న ఇంధన ధరల వలన ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన ఈ చార్జింగ్ కేంద్రంలో కేవలం అరగంటలో చార్జింగ్ పూర్తికావడం విశేషం. నగరంలో ఇప్పటికే ఉన్న ప్రైవేట్ చార్జింగ్ కేంద్రాల ధరల కంటే రెడ్కో ఏర్పాటు చేసిన ఈవీ స్టేషన్లలో ధరలు తక్కువగా ఉండనున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐసీ, ఫుడ్ కార్పొరేషన్‌ల నుంచి సేకరించిన ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టేషన్లలో చార్జింగ్ కేంద్రాలు నెలకొననున్నాయి.
ఒకేసారి రెండు వాహనాలకు చార్జింగ్ ప్రక్రియ కొనసాగితే కార్లు ఫుల్ చార్జింగ్ కావడానికి అదనంగా మరో 15 నిమిషాలు పడుతుంది. ఒకే వాహనం చార్జింగ్ అయితే అరగంటలో ఫుల్ అవుతుంది. 2030 నాటికి అన్ని రకాల ఈ -వెహికిల్స్ రెండు, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, కార్లు ఎక్కువ శాతం వినియోగానికి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక విధానాలు రూపొందించి విద్యుత్ వాహనాల కంపెనీల ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేసున్నది.
కాగా విద్యుత్ వాహనాలను వినియోగించడంవల్ల ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఒక్కోసారి బ్యాటరీ లోపం తో పేలిపోతున్నాయి అలాంటి సంఘటనలు హైదరాబాద్ లో చాలానే జరిగాయి. మొన్నామధ్య ఎలక్టిక్ కారులో చెలరేగిన మంటలవల్ల మరో మూడు కార్లు కూడా తగలబడ్డాయి. అప్పుడప్పుడు ‘ఈ’ వాహనాలతో కూడా ముప్పు ఉంది. ఇటివంటివి జరుగకుండా నాణ్యమైన ఈ వాహనాలను ప్రభుత్వాలు దిగుమతి చేసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.