ED Remand Report: కవితకు 33 శాతం వాటా
ED Remand Report: తెలంగాణ ఎమ్మెల్సీ కవితను నేడు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ మనీష్ సిసోడియా విచారణకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను తయారు చేశారు. 58 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్ట్‌ను ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టుకు సమర్పించారు. కాగా, ఈ రిపోర్ట్‌లో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. కేజ్రీవాల్‌లో కవితకు ఉన్న రాజకీయ సంబంధాలపై ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆప్ నేతలకు అందిన ముడుపులపై కూడా సాక్ష్యాలు ఉన్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆప్‌కు అందిన ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ రిపోర్ట్‌లో పేర్కొన్నది. కాగా, ఈ కేసులో ఈడీ మరిన్ని సాక్ష్యాలను కోర్టు ముందుకు తీసుకొచ్చే అకవాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా ఉందని కూడా పేర్కొన్నది. సంభాషణల కోసం ప్రత్యేకమైన కోడ్ భాషను వినియోగించారని ఈడీ తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రామచంద్రపిళ్లై, మనీష్ సిసోడియా విచారణ ఆధారంగా కవితను విచారించనున్నట్లు ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. కాగా, నేడు కవిత విచారణపై ఉత్కంఠ నెలకొన్నది. ఆమె అరెస్ట్ తప్పదని వస్తున్న వార్తల చుట్టూ రాజకీయం నడుస్తున్నది. ఈ కేసులో ఎవరున్నా విచారిస్తామని కేంద్ర ఏజెన్సీలు స్పష్టం చేశాయి.