ED Notices to Kavita: లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు
ED Notices to Kavita: లిక్కర్ స్కాంలో కేంద్ర ఏజెన్సీ సంస్థలు దూకుడు పెంచాయి. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని ప్రశ్నంచడమే కాకుండా అరెస్టులు కూడా చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మార్చి 20 వ తేదీ వరకు కస్టడీ విధించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అదికారులు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించారు. హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారించారు. కాగా, ఇప్పుడు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 10 వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
అదే రోజున కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్న చేసేందుకు సిద్దమౌతున్నారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం ధర్నా చేయాలని నిర్ణయించారు. అదే రోజున ఈడీ విచారణకు కూడా ఆమె హాజరుకావలసి ఉన్నది. లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కాకుండా ఉండేందుకే ఆమె ధర్నా కార్యక్రమం చేపడుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గతంలో విచారణకు సహకరిస్తానని చెప్పిన కవిత ఇప్పుడు ఎందుకు సహకరించరని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైని లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. విచారణలో తాను కవిత బినామి అని ఒప్పుకున్నారని ఈడీ వెల్లడించింది. రామచంద్రపిళ్లై వాగ్మూలం ఆధారంగానే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.