ఎండాకాలం లో మొన్నటిదాకా వర్షాలు కురిసాయి. ఇక వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు షురూ అయ్యాయి. హైటెక్ సిటీ నుంచి బస్తీల వరకు ఎక్కడ చూసినా నీటి సమస్యే.
Hyderabad: ఎండాకాలం లో మొన్నటిదాకా వర్షాలు కురిసాయి. ఇక వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు షురూ అయ్యాయి. హైటెక్ సిటీ నుంచి బస్తీల వరకు ఎక్కడ చూసినా నీటి సమస్యే. స్లమ్ ఏరియాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి. వాటర్ బోర్డు సప్లయ్ చేసే నీళ్లు సరిపోతలేవని అన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిటీలోని సుమారు 1,800 ప్రాంతాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందులో 300 ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు తగ్గడంతో కొన్ని బోర్లు పని చేయడం లేదు. ప్రధానంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, నిజాంపేట, తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి.
బోడుప్పల్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, నిజాంపేట, మన్సూరాబాద్, మౌలాలీ, బహదూర్ పురా, సీతాఫల్ మండి, బండ్లగూడ జాగీర్, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో నీటి సమస్యపై నిత్యం ఏదో ఒక చోట జనం ఆందోళనలు నిర్వహిస్తున్న అధికారులు పట్టనట్టు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్‌బోర్డు సరఫరా చేసే నీరు మాత్రమే ఆధారంగా మారింది. బోర్లు పని చేయకపోవడంతో అపార్ట్‌మెంట్‌వాసుల అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో వాటర్‌బోర్డు ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. సాధారణ రోజు ల్లో రోజుకు 500 నుంచి 700 వరకు ట్యాంకర్ల బుకింగ్‌లు ఉండేవి. వేసవి నేపథ్యంలో రెండింతలకు పైగా పెరిగాయి. పైగా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని స్థానికులు చెపుతున్నారు.
వేసవి వచ్చిందంటే నీళ్లకోసం జనం రోడ్లపైకి వస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వారానికి రెండు సార్లు, కొన్ని చోట్లయితే ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో జనం పరేషాన్ అవుతున్నారు. నీళ్లు ఎప్పుడొస్తయోనని నల్లాల దగ్గర ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 20 లక్షల నివాస సముదాయాలుండగా.. జలమండలి 8.64 లక్షల నివాసాలకు మాత్రమే రోజూ 340 నుండి 450మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తోంది. కొన్ని చోట్ల వారం, మరికొన్ని చోట్ల 15 రోజులకోసారి సరఫరా జరుగుతోంది. బోడుప్పల్, మేడిపల్లిలోని కొన్ని చోట్ల నెలకో రోజు మాత్రమే కుళాయిల్లో నీళ్లొస్తున్నాయని చెపుతున్నారు. పలు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వెయ్యికి పైగా కాలనీల్లో రిజర్వాయర్లు, పైప్లైన్లు లేవు. ఇక్కడి వారు బోరు బావులపైనే ఆధారపడి దాహార్తిని తీర్చుకోవాల్సివస్తోంది.
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఫిబ్రవరి నాటికి ఈసారి గ్రౌండ్‌వాటర్ లెవల్స్ తగ్గాయి. మేడ్చల్– మల్కాజిగిరిలోని 7 మండలాల్లో పడిపోయాయి. అలాగే జనవరితో పోలిస్తే మూడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మీటర్, రెండు మీటర్ల చొప్పున కిందికి వెళ్లాయి. రెండు నెలలుగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భ జలాలు తగ్గుతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో జనం మోటార్లను మరింత లోతుకు దించుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో బోర్లను కిందికి దించారు. పోయినేడు సరిపడా నీళ్లు ఉండడంతో సమ్మర్లో బోర్లు ఎండిపోలేదు. నాగార్జునసాగర్‌లో నీటిమట్టాలు ఈ ఏడాది గణనీయంగా పడిపోతున్నాయి. జనవరి ఒకటిన 579.300 అడుగులు ఉండగా, ప్రస్తుతం 528.70 అడుగులకు చేరాయి. మూడు నెలల్లోనే 50 అడుగుల మేర నీటిమట్టాలు తగ్గాయి. ఇదే స్థాయిలో సాగర్ నీటిమట్టాలు తగ్గితే 40 నుంచి 45 రోజుల్లో ప్రమాదకర స్థాయికి చేరే అవకాశాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలోను ఇదే పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధానకారణం పట్టణాల్లోని చెరువులు పూడికతీతకు నోచుకోకపోవడం, పారిశ్రామీకరణ గా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లు ఎండిపోతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ లో 9.13, దుండిగల్ 13.74, కూకట్‌పల్లిలో 13.53నుంచి 16.88, మల్కాజిగిరిలో 15,26, ఉప్పల్ లో 13 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి వెళ్లాయని అధికారులంటున్నారు. ఎండలు పెరగక ముందే ఈసారి బోర్లు ఎండిపోతుండడంతో జనం అప్రమత్తం అవుతున్నారు. ప్రభుత్వం ఇంటింటికి నల్లాలు ఏర్పాటుచేసిన అందులో సరిపోను నీరురాక నగరవాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.