HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో భగ్గుమన్న విభేదాలు
Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా HCAలో మరోసారి వివాదం నెలకొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ వైఖరి సరిగ్గా లేదంటూ ఇతర సభ్యులు అతనిపై విమర్శలు చేశారు. అసోసియేషన్లో అవినీతి రాజ్యమేలుతోందని బీసీసీఐ మాజీ మధ్యంతర ప్రెసిడెంట్ శివ లాల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. HCAలో అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు.
అజహరుద్దీన్ వ్యవహార శైలి వల్ల యువ ఆటగాళ్లు, క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అజార్ అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఆటగాళ్లపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెట్ సలహా కమిటీని అజహరుద్దీన్ రద్దు చేసి తన సొంత సెలక్షన్ కమిటీని నియమించుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జూనియర్స్ సెలక్షన్ కమిటీని అజహర్ నియమించి.. నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల HCA ప్రెసిడెంట్ అజార్ లేకుండానే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, శేషు నారాయణ, మహేందర్ పాల్గొనడం వివాదాలకు దారి తీసింది.