GHMC : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీశ్రేణుల ధర్నా
GHMC: జీహెచ్ఎంసీ లో నకిలీ సర్థిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు కేంద్రంగా జీహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విభాగం మారింది. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే 27 వేల జనన, మరణ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ జారీ చేసింది. ప్రధాన కార్యాలయంలో అధికారుల చేతివాటం వెలుగులోకి రావడంతో.. మొత్తం 31 వేల బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. ఈ సంఘటనపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం.
ఇంతపెద్దఎత్తున కుంభకోణం జరుగడంతో బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. బర్త్ సర్టిఫికెట్ లలో అవకతవకలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మేయర్ రాజీనామా చేయాలని ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందుధర్నాకు బీజేపీ కార్యకర్తలు రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ నేతలు మేయర్ ఛాంబర్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.