Delhi Liquor Scam: నేడు ఈడీ ముందు హాజరుకానున్న కవిత
Delhi Liquor Scam: నేడు కల్వకుంట్ల కవిత ఈడీ ముందు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అనేక మందిని అరెస్ట్ చేసింది. తాజాగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేశారు. సిసోడియాను ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్ చేయగా, మార్చి 9వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ కవితకు నోటీసులు జారీ చేశారు. అయితే, రామచంద్ర పిళ్లై తన స్టేట్మెంట్‌ను వెనక్కి తీసుకోవడంతో కోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం నేడు కవితను అధికారులు విచారించనున్నారు.
రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాతో కలిపి కవితను విచారించే అవకాశం ఉన్నది. ముగ్గురిని ఒకేమారు విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవితను ఏ విధంగా ప్రశ్నించనున్నారన్నది ఆసక్తికరం. ఇక కవిత అరెస్ట్ తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోకే తెలంగాణ మంత్రులు కేటీఆర్, కేసీఆర్‌లు ఢిల్లీ చేరుకున్నారు. కవితకు మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్చి 10వ తేదీన కవిత మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఒక్కరోజు దీక్షను చేశారు. ఈ దీక్షకు 13 పార్టీలు మద్దతు ఇచ్చాయి.