D-Mart to Pay Big Fine : షాకిచ్చిన సిఆర్‌డిసి… భారీ జరిమానా
హైదరాబాద్ లోని ఓ డీ-మార్ట్ కు సిఆర్‌డిసి భారీ జరిమానా విధించి షాకిచ్చింది. క్యారీ బ్యాగ్ కోసం వినియోగదారుడి నుండి డబ్బులు వసూలు చేసినందుకు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (సిఆర్‌డిసి) డీ-మార్ట్ కు ఈ జరిమానా విధించింది. విషయంలోకి వస్తే… 2019 డిసెంబర్‌లో ఓ వ్యక్తి హైదర్‌గూడ డీ-మార్ట్ లో రూ. 479 విలువైన సామాగ్రిని కొనుగోలు చేశారు. అయితే డీ-మార్ట్ ఉద్యోగులు వారి లోగో-ప్రింటెడ్ క్యారీ బ్యాగ్‌కు రూ. 3.50 వసూలు చేశారని వి నరసింహ మూర్తి సిఆర్‌డిసిలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణలో కమిషన్ రిటైల్ చైన్ డీ-మార్ట్ ను సదరు వ్యక్తిని రూ. 10,000 పరిహారం చెల్లించాలని, దాంతో పాటు క్యారీ బ్యాగ్ కోసం అతని నుంచి వసూలు చేసిన రూ. 3.50 కూడా చెల్లించాలని ఆదేశించింది. దీంతో క్యారీ బ్యాగుల కోసం వినియోగదారులు క్యారీ బ్యాగ్ ల కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించే అవసరం లేదని సిఆర్‌డిసి దిశానిర్దేశం చేసినట్టయ్యింది. ఇక డీ-మార్ట్ కు జరిమానాను చెల్లించడానికి 45 రోజులు గడువు విధించింది. ఆలోగా డీ-మార్ట్ సిఆర్‌డిసి ఆదేశాలను పాటించడంలో విఫలమైతే జరిమానాను 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించవలసి ఉంటుంది. అయితే క్యారీ బ్యాగ్ కోసం వినియోగదారుడి నుంచి చార్జీ విధించినందుకు డీ-మార్ట్ కు జరిమానా విధించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా కమీషన్ క్యారీ బ్యాగ్ కోసం అదనపు డబ్బు వసూలు చేసినందుకు ఫిర్యాదుదారుడికి పరిహారంతో పాటు వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలంటూ డీ-మార్ట్ కు రూ. 50,000ల భారీ ఫైన్ విధించింది.