పోలీస్ అకాడమీలో దొంగతనం.. ఇంటిదొంగ పనే..!
Theft In Police Academy :నేరాలు, దొంగతనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు శాఖే దొంగతనం బారిన పడింది. ఏకంగా పోలీస్ అకాడమీలోనే దొంగతనం జరిగింది. రాజేంద్రనగర్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అకాడమీలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి. భద్రతా బలగాల కళ్లు గప్పి ఏకంగా 7 కంప్యూటర్లను మాయం చేశారు. అయితే.. ఇది ఎవరో చేసిన పని కాదు.. ఇంటి దొంగ పనే. కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. వెంటనే అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు.
అకాడమీలోని ఐటీ సెక్షన్‌లో పని చేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఎన్‌పీఏ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలే పండుగ సెలవులు.. ఆపై అందరూ ఊళ్లు వెళ్లటం… చోరీల ఘటనలు వెలుగు చూస్తుండటంతో పోలీసులు ఆవైపు ద్రుష్టి పెట్టారు. ఇదే అదనుగా అకాడమీలో చోరీకి చంద్రశేఖర్ తెగబడ్డాడు.