Ragging: ర్యాగింగ్ చేస్తే కాలేజ్ సీటు రద్దు..తెలంగాణ సర్కార్ నిర్ణయం
Ragging: ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. పటిష్టమైన నియంత్రణ చర్యలపై యూనివర్సిటీలు, కాలేజీలు ప్రధానంగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు సరైన మొగ్గుచూపకపోవడంతో ర్యాగింగ్ రక్కసి వికటాట్టహాసం చేస్తోంది. వేదనకు గురైన విద్యార్థులు ఇక తమకు చావే శరణ్యమని భావించి క్షణికావేశంలో తనువూ చాలిస్తున్నారు.ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆయా యూని వర్సిటీలు, కాలేజీ యాజమాన్యాలు ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’లా తూతూ మంత్రంగా ర్యాగింగ్ నియంత్రణ కమిటీలు వేస్తున్నామంటూ హడావుడి చేస్తున్నాయి తప్ప పూర్తిగా ఈ ర్యాగింగ్ రక్కసిని అంతమొందించలేక పోతున్నాయి.
వైద్య విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ రక్కసికి బలైపోయింది.ఎంతోమంది ప్రాణాలను కాపాడలిసిన ఈ వైద్య విద్యార్ధి సీనియర్ల ర్యాగింగ్ భూతానికి గురై తనువుచాలించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఓ కఠిన నిర్ణయం తీసుకోబోతుంది. విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు రుజువైతే ర్యాగింగ్ చేసిన సదరు విద్యార్థి మెడికల్ సీటును రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే ఇతర కాలేజ్ వారైతే వారి సీటు ను కూడా రద్దుచేసే దిశగా అడుగులేయబోతుంది. ఇటీవల గాంధీ మెడికల్ కాలేజీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన కొంత మంది సీనియర్లను మూడు నెలలపాటు సస్పెండ్ చేశారు. అయితే ఇలాంటి చిన్నచిన్న శిక్షలుసరిపోవని సర్వత్రా విమర్శలు ఎదురవుతుండడంతో ఏకంగా సీటు ను రద్దుచేసే దిశగా అడుగులువేస్తోంది.