Telangana Martyrs’ Memorial: హైదరాబాద్ ఖాతా లో మరో అధ్బుతం సిద్ధమయ్యింది.. అమరుల స్థూపం ప్రారంభానికి సిద్దం అయ్యింది. పదేళ్ల తెలంగాణ అవతరణ సంబరాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతోంది. తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారక నిర్మాణం తుది దశకు చేరుకుంది. అఖండదీపంలా కనిపిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సకల హంగులతో స్మారకాన్ని నిర్మించారు. స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అతపెద్ద కట్టడంగా నిలిచిపోనుంది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించేందుకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్ నడిబొడ్డున సాగరీతీరాన మరో అద్భుత నిర్మాణం సిద్దం అవుతోంది. ఇప్పటికే 125 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం.. వైట్ హౌస్ నమూనాలో సచివాలయం దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు సమీపం లోనే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ జలదృశ్యంలో సమావేశం జరిగిన ప్రదేశంలోనే నేడు ఈ స్మారకాన్ని నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని కాంక్షిస్తూ ఎక్కడైతే మొట్టమొదటి సమావేశం జరిగిందో అదే స్థలంలో నేడు కేసీఆర్ నేతృత్వంలోనే అమరవీరుల స్థూపాన్ని నిర్మిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు.
స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్మాణం ఆకృతి మట్టిదీపంలా ఉంది. అమరులకు దీపంతో నివాళి అర్పిస్తారు కాబట్టి ఈ నమూనాతో నిర్మించారు. అతిపెద్ద స్టీల్ బిల్డింగ్. ఇందులో వాడిన స్టీల్ అత్యంత నాణ్యమైన హయ్యర్ గ్రేడ్ స్టీల్. ఆ రకాన్ని 316 L అని పిలుస్తారు. అది వందేళ్లయినా తుప్పు పట్టదు ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెయిన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిప్టులు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పైఅంతస్థులో రెస్టారెంట్ ఇక్కడి ప్రత్యేకతలు. అమరవీరులకు నివాళి అర్పించటంతో పాటుగా ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా తీర్చి దిద్దుతున్నారు.
దీపం పక్కనే ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించారు. 700 మంది వరకు ఇక్కడ కూర్చొనే అవకాశం ఏర్పాటు చేసారు. ఒక మినీ థియేటర్ నిర్మించారు. తెలంగాణ చారిత్రక నేపథ్యం..తిలి దశ పోరాటం..తెలంగాణ సాధన లో చోటు చేసుకున్న పరిణామ క్రమం..అమరవీరుల గురించి ప్రతీ ఒఖ్కరు తెలుగసుకొనేలా మ్యూజియంలో డిజిటల్ రూపంలో వివరించేలా ఏర్పాట్లు చేసారు. 15 నిమిషాల నిడివి ఉన్న డాక్యమెంటరీని ప్రదర్శించనున్నారు. దీపం నిర్మాణం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంత పెద్దగా గాలి వీచినా తట్టుకొనేలా జ్వాలను సిద్దం చేసారు. సూర్యాస్తమయం అవుతున్నా కొద్దీ జ్వాల ప్రజ్వరిల్లుతూ, గాలికి సుతారంగా ఊగుతూ, నిజమైన అఖండదీపంలా కనిపిస్తుంది.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. ఇదే సమయంలో మరోసారి ఎన్నికలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ సమయంలో చిరకాలం నిలిచి పోయే నిర్మాణాలను వరుసగా ప్రారంభానికి నిర్ణయించింది. అందులో హుస్సేన్ సాగర తీరం ఇప్పడు నవ నిర్మాణాలతో హైదరాబాద్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా మారింది. తెలంగాణ సాధనలో అమర వీరుల త్యాగాలకు గుర్తింపు ఇస్తూ..వారి కీర్తి నిలిచిపోయేలా ఈ స్తూపం నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఈ నిర్మాణం ప్రారంభం తరువాత మరో రికార్డు స్థాయి నిర్మాణంగా అందరూ గుర్తిస్తాని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. త్వరలోనే సీఎం కేసీఆర్ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్నారు.