Bus Stands and Railway Stations: పల్లెబాట పడుతున్న పట్నం వాసులు
Bus Stands and Railway Stations: సంక్రాంతి కి నగర ప్రజలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ని పల్లెలకు పయనమవుతున్నారు. హైదరాబాద్ ను ఖాళీ చేసి సొంతూర్లకు వెళ్తున్నారు. పై చదువులకు వెళ్లిన విద్యార్థులు , ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సంక్రాంతికి స్వగ్రామాలకు వెళుతుంటారు. వీరికి ప్రయాణం సాఫీగా సాగేందుకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికు లు వెళ్తుండడంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పండగ సందర్భం గా దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 10 నుంచి 19 వరకు దాదాపు 300కు పైగా స్పెషల్ రైళ్లు నడిపిస్తోంది. రోజువారీ నడిచే 278 సాధారణ రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లు తిరుగుతున్నా రద్దీ తగ్గడం లేదు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్, ఎల్ బి నగర్ వద్ద ఉదయం నుంచి ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ భారీగా నెలకొంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ జనాలు సొంతూళ్లకు బయలు దేరారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారిపోయింది. వేల సంఖ్యలో వస్తున్న వాహనాలతో చౌటుప్పల్ మండల కేంద్రంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. గురువారం ఒక్క రోజే 5 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లారని సమాచారం. పండగ కోసం 4200 ప్రత్యేక బస్సులను నడపడానికి ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసినా మరో 1000 బస్సులకు డిమాండ్ పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎల్బీనగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతాలు రద్దీగా మారాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ, ట్రాఫిక్, రవాణ శాఖ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.