China Manja: యమ పాశంగా చైనా మాంజా..ఆరేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
China Manja: రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించ్చిన కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ చైనా మాంజా మార్కెట్లోకి వస్తుంది. ఎన్ని చట్టాలు తెచ్చిన కూడా ఈ చైనా మాంజా సంక్రాంతి సీజన్లో వచ్చి గాలిపటం ఎగురేయడానికే కాదు ప్రాణాలను బలి తీసుకోడానికి కూడా వస్తుంది. తాజాగా హైదరాబాద్ నాగోల్‌లో చైనా మంజా మెడకు చుట్టుకుని చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
నాగోల్‌లో ఆరేళ్ల చిన్నారి మెడకి మంజా చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన తండ్రి పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. హైదరాబాద్‌లోని నాగోల్ ఫ్లై ఓవర్‌పై జరిగింది ఈ ఘటన. చైనా మంజాపై నిషేధం వున్నప్పటికీ .. నగరంలోని రోడ్లపై బహిరంగంగా దీనిని విక్రయిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు చిన్నారి ఆసుపత్రి పాలైంది. పాపను పరిశీలించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
చైనా మాంజా విక్రయించిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారు. కానీ, కొంతమంది వ్యాపారులు చైనా మాంజాలను విక్రయిస్తున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా జనం వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. పండగపూట పలుకుటుంబాల్లో చైనా మాంజా విషాదాన్ని నింపుతుంది.