హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మొదటి బ్యాచ్ కు చెందిన 43 మంది పట్టభద్రులకు పట్టాలను అందజేశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మొదటి బ్యాచ్ కు చెందిన 43 మంది పట్టభద్రులకు పట్టాలను అందజేశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి బలమైన శక్తిగా ఆవిర్భవించే అంశంలో భారత్ కు అనేక అనుకూల అంశాలు ఉన్నాయని తెలిపారు. యువ శక్తితో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. దేశ అనుకూలతల ద్వారా 2047 నాటికి కార్పొరేట్ అండ్ పబ్లిక్ గవర్నెన్స్ లో ప్రపంచంలో అన్ని చోట్లా ఇండియన్స్ అగ్రస్థానంలో నిలుస్తారని తెలిపారు.
యువకులే సమాజంలో మంచి పాలసీలు తీసుకువచ్చి సమాజంలో మార్పులు తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు నవ్వుకున్నారని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని హేళన చేసారు. అలా హేళన చేసినవారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన సమయంలో చాలామంది హెచ్చరించారని చంద్రబాబు గుర్తుచేశారు. దాని వల్లే తాను అధికారం కూడా కోల్పోయానని ఆయన పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ల రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చానని.. ఆ ఫలితాలు ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
బిల్గేట్స్ తనకు ఇచ్చిన పది నిమిషాల సమయంలోనే తనకు హైదరాబాద్ గురించి ప్రజంటేషన్ ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఆ రోజు నేను చేసిన కృషి ఫలితంగానే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిందని, సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా వున్నారని ఆయన పేర్కొన్నారు. ఐటీ తర్వాత తాను ఎక్కువగా ఫార్మా రంగంపై దృష్టి సారించానని.. జీనోమ్ వ్యాలీ కోసం అప్పట్లో భారీగా భూములు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి బాటలో నడవడానికి అప్పట్లోనే తెలుగు దేశం కంకణం కట్టుకుందని తెలిపాడు. దానిఫలితమే సైబర్ టవర్స్, ఐటీ ఉపాధి కల్పనా తదితర రంగాల్లో యువతను ప్రోత్సహించి వారికి తగినన్ని వనరులిచ్చి వారికీ వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు.