Hyderabad : చైన్ స్నాచర్ల గుట్టు రట్టు… మామూలు ప్లానింగ్ కాదుగా!
Chain Snatching Team Arrested by Cyberabad Police : చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఒకే రోజు సైబరాబాద్ కమిషనరేట్ లోని గచ్చిబౌలి, కూకట్ పల్లి, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అరెస్ట్ చేశారు. నిందితులు కర్ణాటక కు చెందిన ఇషన్ నిరంజన్ నీలంనాలి (21), రాహుల్ (19) గా గుర్తించారు. తాపంచ, రివాల్వర్ ను ఉత్తర్ ప్రదేశ్ నుంచి కొనుగోలు చేసిన ఈ నిందితులు ఇద్దరు ఈ నెల 25న ఒకే రోజు గచ్చిబౌలి, కూకట్పల్లి, రామచంద్రపురం వంటి ప్రాంతాలను టార్గెట్ చేసి పక్కా ప్రణాళిక ప్రకారం చైన్ స్నాచింగ్ రంగంలోకి దిగారు. తిరిగి మరుసటి రోజు 26 న మియపూర్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. అనంతరం మియపూర్ నుండి BHEL మీదుగా పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన నిందితులు అక్కడే బోర్లా పడ్డారు.
సిటీలో చైన్ స్నాచింగ్ కు సంబంధించి వరుస కేసులు నమోదు అవుతుండడంతో అన్ని పోలీస్ స్టేషన్ లను అలెర్ట్ చేసి వెహికల్ చెకింగ్ నిర్వహించారు పోలీసులు. అదే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుల్ థేబేస్, కానిస్టేబుల్ రవి లు నింధితులను గుర్తించి పట్టుకున్నారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పై వివిధ భాగాల్లో మొత్తం 7 చోట్ల కత్తితో దాడి చేశారు. అయినప్పటికీ నిందితులను వదలకుండా పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం యాదయ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ వారి ప్రతిభ, ధైర్య సాహసాలు పోలీస్ వ్యవస్థకు మంచి గుర్తింపు తెచ్చాయని ప్రశంసించారు. ఇక పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 1 తాపంచ, 13 లైవ్ బుల్లెట్ లు, 1 రివాల్వర్, 2 లైవ్ బులెట్ లు, రెండు మొబైల్ ఫోన్ లు, ఒక ద్విచక్ర వాహనం, రెండు కత్తులు, 47 గ్రాములు విలువ చేసే మూడు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.